Thursday, March 24, 2011

సర్వశక్తులూ ఒడ్డినా.. ఆ ‘ఒక్కడి’దే విజయం!

  • అధికార, ప్రతిపక్షాల ఫిక్సింగ్ పనిచేయలేదు... !
  • ముఖ్యమంత్రి, నలుగురు రాష్ట్ర మంత్రులు, ఓ కేంద్రమంత్రి కలిసి పనిచేసినా ప్రయోజనం లేదు ..!
  • దింపుడు కళ్లం ఆశతో రీకౌంటింగ్‌కూ డిమాండ్ చేసిన ఫలితం లేక పోయింది ... !!!!

రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నా.. అందరి దృష్టీ ఒక్క జిల్లాపైనే.. ఆ ‘ఒక్కడు’ జగన్‌మోహన్‌రెడ్డిపైనే!
ఆ ఒక్కడిని ఓడించడానికి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కయ్యాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా టీడీపీ అభ్యర్థినే నిలపలేదు. దీనికితోడు ముఖ్యమంత్రి, నలుగురు రాష్ట్ర మంత్రులు, ఓ కేంద్ర మంత్రి.. కంటిమీద కునుకులేకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ‘కృషి’ చేశారు. ఇంత చేసినా.. అన్ని శక్తులూ ఏకమైనా.. వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అనుకూల అభ్యర్థి చదిపిరాళ్ల నారాయణరెడ్డి (దేవగుడి నారాయణరెడ్డి) 10 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. తాము అభ్యర్థులను నిలపడంలేదని, ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలన్న ఆ ‘ఒక్కడి’ పిలుపు మేరకు ఓటర్లంతా నారాయణరెడ్డికి పట్టం కట్టారు.

సర్వత్రా ఉత్కంఠ: పోలింగ్ ముగిసిన మార్చి 21 నుంచి బుధవారం వరకు అందరిలో నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగింది. ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి, ఇరువర్గాల ఆమోదంతో నిర్ణయం తీసుకోవడంతో విపరీతమైన ఆలస్యం జరిగింది. నారాయణరెడ్డికి 313 ఓట్లు వచ్చినట్లు లెక్కలో తేలింది. మరో స్వతంత్ర అభ్యర్థి చిన్న సంజీవరెడ్డికి ఒక ఓటు పడింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వరదరాజులరెడ్డికి 303 ఓట్లు వచ్చాయి.

రీకౌంటింగ్‌కు వరద డిమాండ్: ఓట్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యం కనిపించినా, మళ్లీ లెక్కింపు చేయాలని వరదరాజులరెడ్డి పట్టుబట్టారు. ‘ముందు లెక్కించిన ఓట్ల సంఖ్యను ప్రకటించి, ఆ తరువాత మళ్లీ లెక్కింపు చేస్తే మాకు అభ్యంతరం లేదు. అధికారిక గెలుపు ప్రకటనను రీకౌంటింగ్ తర్వాతే చేయండి’ అని నారాయణరెడ్డి పట్టుబట్టారు. జిల్లా ఎన్నికల అధికారి కె.నిర్మల, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు చంద్రమౌళి చర్చించుకుని.. అంత వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సంఖ్యలను ప్రకటించారు. నారాయణరెడ్డికి 313 ఓట్లు, వరదరాజులరెడ్డికి 303 ఓట్లు, బాపతి చిన్నసంజీవరెడ్డికి ఒక ఓటు వచ్చాయని, నాలుగు ఓట్లు చెల్లనివిగా తేలాయని తెలిపారు. తర్వాత తిరిగి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రీకౌంటింగ్ జరుగుతుండగానే విషయం గ్రహించి వరదరాజులరెడ్డి లెక్కింపు కేంద్రం నుండి నిష్ర్కమించారు. నారాయణరెడ్డే గెలిచారు.

పోటాపోటీ: కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలు ప్రచార పర్వం నుంచేపోటాపోటీగా మారాయి. జగన్‌ను సొంత జిల్లాలోనే కట్టడి చేసేందుకు కాంగ్రెస్, దాని బద్ధ శత్రువైన తెలుగుదేశం కుమ్మక్కయ్యాయి. టీడీపీ నేతలు తమ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో క్యాంపులు నిర్వహిస్తూ లోపాయికారిగా కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ తరఫున జిల్లాకు చెందిన మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లాలతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌లు సర్వశక్తులూ ఒడ్డారు. అనేక మంది ఓటర్ల వద్దకు వెళ్లి, స్వయంగా ముఖ్యమంత్రితో ఫోన్ కలిపి మాట్లాడించారు. ఓటర్లను సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగదీసుకునే ప్రయత్నాలు చేశారు. అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తూ స్వయంగా మంత్రులే ఓటర్ల కొనుగోలుకు, కిడ్నాప్‌లకు పాల్పడ్డారు. టీడీపీ నేతల ఇళ్లకు, కార్యాలయాలకు వెళ్లేందుకు కూడా వెనుకాడలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన 122 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఐదు మంది బద్వేలు మున్సిపల్ కౌన్సిలర్లు పోలింగ్ రోజున బాహాటంగానే వెళ్లి ఓటు వేశారు. తొలి నుంచీ ప్రచారం జరిగినట్లు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం అపవిత్ర కలయికకు పాల్పడిందని చెప్పకనే చెప్పారు. ఈ తెలుగుదేశం ఓటర్లతో పాటు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లందరినీ మంత్రులు ప్రలోభపెట్టారు. అయినా గెలవలేకపోయారు.

ఆ మంత్రులకు శృంగ భంగం
ఎన్ని ఎత్తులు వేసినా, వ్యూహాలు పన్నినా మంత్రులకు శృంగభంగం తప్పలేదు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాగానే ఓటుకు లక్ష అంటూ క్యాంపు రాజకీయానికి తెరలేపిన అధికార పార్టీ తరఫున మంత్రులు వ్యక్తిగత ప్రతిష్టకు పోయారు. రోజులు గడిచే కొద్దీ ఓటు రేటు పెంచుకుంటూ పోయారు. ఎన్నికల నాటికి ఒక్కొక్క ఓటరు రేటు 5 లక్షలకు ఫిక్స్ చేశారు. కాంట్రాక్టు పనులు, నియోజకవర్గానికి కనీసం పది మందికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీలు గుప్పించారు. లేని చుట్టరికాలు కలుపుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ మంత్రి డీఎల్ మద్దతు కూడగడితే, మరో మంత్రి వివేకా స్వయంగా ఓటర్ల ఇంటికే వెళుతూ వారి బంధువులను ప్రలోభపెట్టారు. కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదుల్లా, సాయిప్రతాప్ కులాలను తెరపైకి తెచ్చి సమీకరణలకు సిద్ధమయ్యారు. వీరు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వైనాన్ని బయటపెట్టడానికి యత్నించిన మీడియానూ బెదిరించారు. సాక్షి మీడియా వాహనంపై దాడి చేశారు. ఇలా ఎంతలా అధికార దుర్వినియోగానికి అక్రమాలకు పాల్పడినా.. వారికి శృంగభంగం తప్పలేదు.

No comments:

Post a Comment